ఏపీలోని నాల్గు జిల్లాలు జలదిగ్భంధంలో ఉన్నాయి ..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని చిత్తూరు , నెల్లూరు , కడప , ప్రకాశం జిల్లాలు పూర్తిగా జలదిగ్భంధంలో ఉండిపోయాయి. ప్రకాశం జిల్లావ్యాప్తంగానూ అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు కూడలి, బాపూజీ కాంప్లెక్స్ ,పోతురాజు కాలువ, కేశవరాజు కుంట ప్రాంతాలు నీట మునిగాయి.

శ్రీకాళహస్తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో..స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో కల్యాణి డ్యాంకు ఉన్న మూడు గేట్లను తెరిచి 1700 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. 1996 తర్వాత మళ్లీ ఇప్పుడు జలాశయం గేట్లను తెరిచారు. ఏర్పేడు-సదాశివపురం, శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట, గుడిమల్లం-శ్రీకాళహస్తి, పంగురు-శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రధాన రహదారులపై… కాజ్‌వేల పైకి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. అధికారులు ముందస్తుగానే ఆయా రహదారులపై రాకపోకలను నియంత్రించారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండి…ప్రమాదకరంగా ఉన్నాయి.

కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో…. పింఛ జలాశయం, అన్నమయ్య ప్రాజెక్టులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తున్నాయి.