మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మొదలుపెట్టగా..ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తున్నారు. ఆ మధ్య రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని చెప్పి..వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ భగ్గుమంది. బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్ల ఫైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా నిరసనలు , ధర్నాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇప్పుడిప్పుడే రేవంత్ వ్యాఖ్యలను మరచిపోతున్న తరుణంలో మరో కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. రైతు బంధు మరియు రైతు బీమా పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి యజమానులకు రైతుబంధు ఇవ్వమని తెలిపారు. కేవలం కౌలు రైతులకు మాత్రమే రైతుబంధు మరియు రైతు బీమా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ తెలిపారు. ఇక కృష్ణ తేజ చేసిన వ్యాఖ్యలపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎంత రగడ నడుస్తుందో చూడాలి.