ఆ కోణంలో ఎందుకు విచారించడంలేదుః అవినాశ్ రెడ్డి

వివేకాకు 2006 నుంచి ఒకామెతో సంబంధం ఉంది..2011లో ఆమెను పెళ్లి చేసుకున్నాడని వెల్లడి

mp-avinash-reddy-press-meet

హైదరాబాద్‌ః వివేకా హత్య కేసులో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు నేడు కూడా ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను విచారణ కోసం ఈ ఉదయం 10.30 గంటలకే సీబీఐ కార్యాలయానికి వచ్చానని, ఉదయం 11.00 గంటల నుంచి ఒంటి గంట వరకు తనను విచారించారని వెల్లడించారు. ఆ తర్వాత కోర్టు నుంచి పిలుపు వచ్చిందని సీబీఐ విచారణ అధికారి కోర్టుకు వెళ్లారని, తనను సీబీఐ కార్యాలయంలోనే ఉండాలని చెప్పారని అవినాశ్ రెడ్డి వివరించారు. సీబీఐ అధికారి కోర్టు నుంచి వచ్చి… ఇవాళ్టికి విచారణ ముగిసిందని చెప్పారని, తాము పిలిచినప్పుడు మరోసారి రావాలని అన్నారని తెలిపారు.

“గతంలో రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరినా గత రెండు పర్యాయాలు పట్టించుకోలేదు. అందుకే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నేను ఇప్పటిదాకా సీబీఐ కార్యాలయంలో ఉండడంతో కోర్టులో ఏం జరిగిందో స్పష్టంగా తెలియదు. ఇక, గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు… అది టిడిపి టేక్ ఔట్ అంటే బాగుంటుంది. తప్పుడు ఎవిడెన్సులతో అన్యాయంగా అమాయకులను ఇరికించడం తప్పు. ఈ దర్యాప్తులో కీలక అంశాలను పక్కనబెట్టి చాలా సిల్లీ అంశాలను తెరపైకి తెచ్చారు. మీకు ఇది కొత్తేమో కానీ… ఓ ఎంపీ సీటు కోసం ఈ హత్య జరిగిందంటే మా జిల్లాలో నవ్వుతారు.

వివేకా గారు చనిపోయే రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లు డోర్ టు డోర్ తిరిగారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డికి ఓటేయండి… ఎంపీ అభ్యర్థిగా అవినాశ్ రెడ్డికి ఓటేయండి అని ఆయన ప్రచారం చేశారు. కానీ వీళ్లు ఈ కోణంలో విచారించడంలేదు. వీరి కుట్రలకు ఉపయోగపడే స్టేట్ మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఒక అప్రూవర్ చెప్పిన కట్టుకథను అడ్డంపెట్టుకుని వీరు ఒక వ్యక్తినే లక్ష్యంగా పెట్టుకుని విచారణ సాగిస్తున్నారు. ఇది తప్పు… ఎవరూ కూడా దీన్ని హర్షించరు. ఇప్పటివరకు మీడియా ఎన్నో విమర్శలు చేసింది…. మా సోదరి సునీతమ్మ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నా… మనం ఎలాంటి తప్పు చేయలేదు అని కార్యకర్తలకు గట్టిగా హామీ ఇస్తున్నా. ఎంతదూరం వెళ్లయినా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక వివేకానందరెడ్డి కుటుంబ వ్యవహారాలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అవినాశ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “2006 నుంచి వివేకాకు ఒకరితో సంబంధం ఉంది. 2011లో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కోసం ఇస్లాం చట్టం ప్రకారం తన పేరు షేక్ మహ్మద్ అక్బర్ అని కూడా మార్చుకున్నారు. పెళ్లి తర్వాత షేక్ షహెన్షా అని ఒకబ్బాయి కూడా పుట్టాడు. భవిష్యత్తులో ఆ కుర్రాడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలన్న ఆలోచన వివేకాలో ఉండేది” అని అవినాశ్ రెడ్డి వివరించారు. కానీ విచారణ మాత్రం మరో కోణంలో తప్పుదోవలో వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో భార్యకు, ఆమె కుమారుడికి వివేకా ఇవ్వదలిచిన ఆస్తి తాలూకు పత్రాలను ఎవరు అడ్డుకున్నారో ఏమో కానీ, తనకు తెలిసినంత వరకు ఇది ఆస్తి కోసం జరిగిన హత్య అని స్పష్టం చేశారు.

“అసలు, అప్రూవర్ చెప్పింది ఒక కట్టుకథ. రూ.8 కోట్ల డబ్బు కోసం గొడవ మొదలైందని చెబుతున్నారు. వివేకా గారు మొత్తం తనకే కావాలన్నట్టు… వీళ్లేమే నువ్వు సగం తీసుకో మేం సగం తీసుకుంటాం అన్నట్టు చెబుతున్నారు. మాటామాటా పెరిగి ఆయనపై దాడి చేసినట్టు పేర్కొంటున్నారు. కానీ ఆ బెంగళూరు సెటిల్ మెంటే ఫెయిలైందని, అవి ఫోర్జరీ పత్రాలు అని 8 మంది సాక్షులే చెప్పారు, లేని డబ్బు కోసం కొట్లాడుకుని చంపేస్తారా?” అని అవినాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఘటన స్థలంలో లేఖను మాయం చేశారని, తాను వెళ్లేసరికి లేఖ ఉందని, కానీ, సునీత భర్త రాజశేఖర్ ఆ లేఖను దాచిపెట్టారని ఆరోపించారు. ఆ లేఖలో కంటెంట్ ను ఎక్కడా చెప్పవద్దని పీఏ కృష్ణారెడ్డికి స్పష్టం చేశారని వెల్లడించారు.

“లేఖను, సెల్ ఫోన్ ను దాచిపెట్టడం తప్పు కాదా? వాళ్లు పొమ్మంటేనే నేను ఘటన స్థలం వద్దకు వెళ్లాను. పోనీ లేఖ గురించి నాకైనా చెప్పాలి కదా. ఆ విషయంలో లేఖ గురించి చెప్పకుండా నన్ను అక్కడికి ఎందుకు వెళ్లమన్నట్టు? వివేకాకు గుండెపోటు అని నేను ఏ ఒక్కరికీ చెప్పలేదు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే నేను ఆ విధంగా చెప్పినట్టు చిత్రీకరించింది. నేను చేసిందల్లా అక్కడి ఘటనను చూసి బంధుమిత్రులకు ఫోన్ చేసి చెప్పడమే. ఇందులో తప్పేముంది? అంతిమంగా న్యాయమే గెలుస్తుంది” అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.