మథురలో ఇస్రో థీమ్​తో జన్మాష్టమి వేడుకలు

Krishna Janmasthan Temple decked up for Janmashtami, celebrations dedicated to Chandrayaan-3 success

మథురః ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రీకృష్ణ జన్మస్థాన ఆలయమైన మథుర జన్మాష్టమి సంబురాలకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది జన్మాష్టమి వేడుకల అలంకరణకు ఆలయ అధికారులు ప్రత్యేక థీమ్​ను ఎంచుకున్నారు. చంద్రయాన్‌-3 మిషన్‌తో భారత్‌కు ప్రపంచఖ్యాతి సాధించి పెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ఏడాది వేడుకలను అంకితం చేయనున్నట్లు ఆలయ ట్రస్టు ప్రకటించింది. ‘‘మెరుగులు దిద్దిన భగవంతుడి నివాసానికి ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమనాథ్‌ కృషికి గుర్తింపుగా ‘సోమనాథ్‌ పుష్ప్‌ బంగ్లా’ అని నామకరణం చేశాం’’ అని ‘శ్రీకృష్ణ జన్మస్థాన్‌ సేవా సంస్థాన్‌’ కార్యదర్శి కపిల్‌శర్మ చెప్పారు. జన్మాష్టమి వేళ ఆలయంలోని కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక వేషధారణ ఉంటుందని తెలిపారు. దీనికి ‘ప్రజ్ఞాన్‌ ప్రభాస్‌’గా పేరు పెట్టినట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం గురువారం ఉదయం 5.30 నుంచి ఆ రోజు అర్ధరాత్రి దాటాక 1.30 వరకు ఆలయ ద్వారాలు తెరిచి ఉంచుతామని వెల్లడించారు.