అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు ఎన్టీవీ-భక్తీ టీవీ కోటి దీపోత్సవం

తెలుగు ప్రజలకు భక్తి టీవీ కోటి దీపోత్స‌వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది. పరమ ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవానికి తెలుగు రాష్ట్రల్లో ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన కార్తీకమాసంలో ప్రజలు నెల పొడవునా శివుడిని ఆరాధిస్తారు. ఈ మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవానికి తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీవీ,భక్తీ టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రి ఈ కార్య‌క్ర‌మాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు.

పవిత్రమైన కార్తీకమాసంలో కోటి దీపాల కాంతుల‌తో భ‌గ‌వంతుణ్ణి జ్యోతి రూపంలో ఆరాధిస్తే సకల కార్యాలు సిద్దించి పుణ్యగతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అలాంటి పరమ పవిత్రమైన దీప యజ్ఞాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగ‌రంగ వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు న‌రేంద్ర చౌద‌రి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే కోటి దీపోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. 15రోజుల పాటు వివిధ దేవతా మూర్తుల కళ్యాణాలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో కోటి దీపాలను వెలిగించి భక్తులు పుణీతులవుతారు. మొదటి సారి 2011లో లక్ష దీపోత్సవాన్ని ప్రారంభించిన భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి భక్తుల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో ఈ కార్యక్రమాన్ని కోటి దీపోత్సవంగా మార్చారు.ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ, ఎన్టీవీ కలిసి కోటి దీపోత్సవం నిర్వహిస్తాయి. పిల్లా,పాపాలతో వేలాది మందిభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలకు కైలాసం దిగివచ్చిందా అన్న రీతిలో తన్మయత్వం పొందుతారు. కోటి దీపోత్సవంలో భాగంగా ప్రతిరోజూ దేవాతా మూర్తులకు ప్రత్యేక పూజలు,కళ్యాణాలు.. సర్వసంగపరిత్యాగులైన పలువురు పీఠాధిపతుల ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులను ఆద్యాత్మిక తన్మయత్వంలో ముంచెత్తుతాయి. 15రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ఆద్యాత్మిక ప్రదేశాల నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, చిన జీయర్ స్వామి, విశాఖ శారదా పీఠం, ఉడిపి పెజావర్, కుర్తాలం తదితర పీఠాధిపతులు కోటి దీపోత్సవానికి హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికపాటి నరసింహారావు వంటి ఆద్యాత్మికవేత్తలు ప్రవచనాలుంటాయి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు జరిగే కోటి దీపోత్సవంలో ఆయారోజుల్లో తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, ఒంటిమిట్ట తదితర దేవతామూర్తులకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. స్వర్ణ లింగోద్భవం, మహానీరాజనం, సప్త హారతి, ఇంకా అనేక ఇతర సాంస్కృతిక కార్యక్రమలు ఈ పదిహేనురోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ఆర్టీసీ సౌజన్యంతో రవాణా సదుపాయం సైతం ఎన్టీవీ,భక్తీ టీవీ యాజమాన్యం కల్పిస్తుంది.