రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు శుక్రవారం యాదగిరిగుట్ట కు వెళ్లనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ సిద్ధం చేసారు అధికారులు. జాతీయ పార్టీపై అక్టోబర్ 5న కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం యాదగిరి గుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దసరా కంటే ముందే సిద్ధిపేటలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటె జాతీయ పార్టీ ప్రకటన వెంటనే దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానాన్నే కొనుగోలు చేయనున్నారని తెలుస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో, 12 సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్య నేతలతో చర్చలకు, విశ్రాంతి తీసుకునేందుకు, మీడియా ప్రతినిధులకు విమానంలోనే ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఈ ఫ్లైట్‌లో ప్రత్యేక ఏర్పా్ట్లు ఉంటాయని అంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొనుగోలు చేస్తున్న ఈ విమానానికి విరాళాలు ఇచ్చేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ విమానం కోసం రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.