ఇప్పుడు గెలవకపోతే జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు.. కొండా సురేఖ

ఇప్పుడు గెలవకపోతే జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు కాంగ్రెస్ నేత కొండా సురేఖ. తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ తమ అభ్యర్థుల ను ప్రకటించి ఎన్నికలకు సిద్ధం కాగా..మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి.

ఈ క్రమంలో వరంగల్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని కలిసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు వర్గాలు ఏర్పడి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఎవరికి వారు తామే అభ్యర్ధులమని ప్రకటించుకుని ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నారు. కర్ణాటకను ఆదర్శంగా తీసుకుని అందరం పనిచేయాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ కు సూచించారు. డీ.కీ శివకుమార్, సిద్దరామయ్య మధ్య విభేదాలు ఉన్నా.. కలిసి కట్టుగా పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలాగే ఇక్కడ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేయాలంటూ కోరారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముందే టికెట్ విషయంలో తన ఆవేదన వెళ్లగక్కిన కొండా సురేఖ టికెట్ ఇస్తారా ..? లేదా అని ప్రశ్నించారు.

‘‘నాకు టికెట్ ఇస్తే ఇస్తా అనండి.. లేదంటే లేదని చెప్పండి.. స్వయం ప్రకటిత నేతలతో పార్టీకే నష్టం జరుగుతోంది.. వరంగల్ తూర్పులో నా కంటే బలమైన అభ్యర్థి ఎవరున్నారు..? నాకే ఇలాంటి ఇబ్బంది వస్తే మిగిలిన నేతల పరిస్థితి ఎంటి..? కాంగ్రెస్‌కి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. కానీ ఓటు వేయించుకోవడానికి నాయకులే సిద్ధంగా లేరు.. తెలంగాణలో ఇప్పుడు గెలవకపోతే.. ఇక జీవితంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు..’’ అంటూ కొండా సురేఖ స్పష్టంచేశారు.