హుజురాబాద్ ఉప ఎన్నికల పోటీఫై కొండా సురేఖ క్లారిటీ

హుజురాబాద్ ఉప ఎన్నికలు ప్రస్తుతం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో బిజెపి నుండి ఈటెల , తెరాస నుండి శ్రీనివాస్ బరిలోకి దిగుతుండగా..కాంగ్రెస్ నుండి ఎవరా అనేది క్లారిటీ లేదు. అయితే కొండా సురేఖ కాంగ్రెస్ నుండి బరిలోకి దిగబోతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ వార్తల ఫై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చింది. టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా తనను పార్టీ నేతలు పోటీ చేయమంటున్నారని … హుజూరాబాద్ లో నిలబడ్డా.. మళ్లీ వరంగల్ కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే బరిలో ఉంటానని చెప్పుకొచ్చింది.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 2018 శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి అనుకున్న దానికన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాటిని నిలుపుకొంటే.. త్రిముఖ పోటీ జరిగి రేసులో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ తమ అభ్యర్థులుగా బీసీలనే బరిలోకి దించుతున్న నేపథ్యంలో బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖ వంటి బలమైన నేతను రంగంలోకి దించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ సామాజికవర్గమైన పద్మశాలీలు, ఆమె భర్త కొండా మురళి సామాజికవర్గమైన మున్నూరుకాపులూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రెండు సామాజికవర్గాలకుతోడు ఇతర బీసీ సామాజికవర్గాల్లోని ఓట్లూ కలిసివస్తే తామే చాంపియన్‌గా నిలవచ్చని కాంగ్రెస్‌ అంచనా వేస్తుంది.