పోలీసుల నిఘాలో అమలాపురం

అమలాపురం లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో కోనసీమ సాధన సమితి మంగళవారం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ , పోలీసులు 144 సెక్షన్ విధించి, గట్టి నిఘా ఏర్పాటు చేసారు. అమలాపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. మళ్లీ ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉండొచ్చనే అనుమానంతో.. ఏయే మార్గాల నుంచి నిరసనకారులు వచ్చే అవకాశం ఉందో.. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అమలాపురంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. ఇదిలా ఉంటె ఈ ఆందోళన వెనుక టీడీపీ, జనసేన పార్టీల హస్తం ఉందని అధికార పార్టీ నేతలు కామెంట్స్ చేయడం ఫై ఆయా పార్టీలు ఖండించారు.