బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

బాసరలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు

minister-indrakaran-reddy-presented-silk-clothes-to-goddess-basara-saraswati

నిర్మల్‌: వసంత పంచమి ఉత్సవాల సందర్భంగా బాసర ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ పర్వదినం నాడు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని రాష్ట్రం నలుమూలల నుంచి తల్లిదండ్రులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ముందే ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు.

కాగా, భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా చీరలను సిద్ధం చేశారు. మగ్గాలను బాసరకు తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలోనే చీరలను నేశారు. ఈ రోజు అమ్మవారిని ఈ చీరలతోనే అలంకరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/