మునుగోడు లో కాంగ్రెస్ గెలవదని తేల్చి చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదని తేల్చి చెప్పారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రస్తుతం వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో బిజీ గా ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియా కు వెళ్లిన ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడ ఎయిర్‌ పోర్టులో కాంగ్రెస్‌ పార్టీ అభిమానులతో ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాను మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసినా.. కాంగ్రెస్‌ గెలవదన్నారు. తాను ప్రచారం చేస్తే.. ఓ 10 ఓట్లు పెరుగుతాయి తప్ప… కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అస్సలు గెలవదని కుండ బద్దలు కొట్టారు. ఇక నేనే ప్రచారానికి వెళ్లి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఎంపీగా మరియు ఎమ్మెల్యే గా 25 ఏళ్లు గా కాంగ్రెస్‌ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఇక నిన్నటికి నిన్న తన తమ్ముడికి ఓటు వేయాలని కోమటిరెడ్డి తెలిపిన ఆడియో ఒకొట్టి లీక్ అయినా సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే తన తమ్ముడికి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు కోరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఫోన్ కాల్ లీక్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని షాక్ లో పడేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సొంత పార్టీ నాయకుడితో ఫోన్ లో మాట్లాడుతూ..మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే ఆ తర్వాత తను టిపిసిసి ప్రెసిడెంట్ అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఫోన్ కాల్ లో మాట్లాడినట్టు ఆ ఆడియో కాల్ ని బట్టి అర్థమవుతుంది. ఆ తర్వాత తను రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని అందులో పేర్కొన్నారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా, బతికినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారని, ఉప ఎన్నికలో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్ రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్ తోవెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం ఇంకా చక్కర్లు కొడుతూనే..ఇప్పుడు మునుగోడు లో కాంగ్రెస్ గెలవదని చెప్పడం కార్య కర్తల్లో అసహనం పెంచుతుంది.