ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన‌ ర‌ష్యా

హైదరాబాద్ : ఉక్రెయిన్‌కు చెందిన ప్ర‌పంచంలోనే అతి పెద్ద కార్గో విమానాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ధ్వంసం చేశాయి. ఈ మేర‌కు ఉక్రెయిన్ మినిస్ట‌ర్ డిమిట్రో కులేబా ప్ర‌క‌టించారు. AN-225 మ్రియా అనే కార్గో విమానాన్ని ర‌ష్యా ధ్వంసం చేసింద‌ని తెలిపారు. ఈ విమానాన్ని ఉక్రెయిన్‌కు చెందిన ఏరోనాటిక్స్ కంపెనీ ఆంటోనోవ్ త‌యారు చేసింది. మ్రియా అంటే ఉక్రెయిన్ భాష‌లో క‌ల అని అర్థం. త‌మ క‌ల‌ల ప్రాజెక్టు అయిన మ్రియాను మ‌ళ్లీ త‌యారు చేస్తామ‌ని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.

రష్యా బలగాలతో ఉక్రెయిన్‌ సైన్యం హోరాహోరిగా తలపడుతున్నది. సామాన్య పౌరులు సైతం వీధుల్లోకి వచ్చి పోరాటాన్ని సాగిస్తున్నారు. రష్యా యుద్ధ ట్యాంకులను అడ్డుకొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌లోకి ప్రవేశించాయి. నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఒక సమయంలో నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించాయి. అయితే, ఉక్రెయిన్‌ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఉక్రెయిన్‌ సేనలదాటికి ఖార్కీవ్‌ నుంచి రష్యా బలగాలు తోకముడిచాయి. దీంతో ఖార్కీవ్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ సైన్యం నియంత్రణలోనే ఉన్నట్టు ప్రాంతీయ గవర్నర్‌ తెలిపారు. ఇక్కడి పోరాట దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలతో పాటు పోర్టులపై కూడా రష్యా దృష్టి పెట్టింది. ఆదివారం దక్షిణ ఉక్రెయిన్‌లోని రెండు కీలక పోర్టులను స్వాధీనం చేసుకొన్నది. కీవ్‌ సమీపంలోని వాసిల్‌కోవ్‌ వద్ద ఒక చమురు డిపోను రష్యా సేనలు పేల్చేశాయి. మరోచోట గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని మరో నగరం నోవా కఖోవ్‌కాను స్వాధీనం చేసుకొన్నట్టు రష్యా సేనలు ప్రకటించుకున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/