కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌

దాసోజు శ్రవణ్‌, స్వామిగౌడ్‌ సొంతగూటికి చేరారు. బిజెపి పార్టీకి రాజీనామా చేసిన వీరు..శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక హోరు కొనసాగుతుంది. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రెండు నెలల క్రితం బీజేపీలో చేరారు. కాగా ఎంతో కాలం ఆయన బిజెపి లో కొనసాగలేకపోయారు.

బిజెపి లో దశ దిశాలేని రాజకీయ పరిణామాలు కొనసాగుతున్నాయని , మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందని మండిపడ్డారు. నోట్లు పంచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బిజెపి తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానట్లు తెలిపారు. అనేక ఆశలతో, ఆశయాలతో నేను బీజేపీలోకి చేరినప్పటికీ దశ-దిశా లేని న్యాయకత్వ ధోరణులు, నిర్మాణాత్మ రాజకీయాలకు, కానీ తెలంగాణ ఏ మాత్రం ఉపయోగకరంగా లేదని అనతికాలంలో అర్ధమైంది. ప్రజాహితమైన పథకాలతో నిబద్దత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం తద్వారా మునుగోడు ఉపఎన్నికలో గెలుపు సాధించాలనుకుంటున్న మీ తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని దాసోజు శ్రవణ్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. శ్రవణ్ తో పాటు స్వామిగౌడ్ సైతం టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బీజేపీ విఫలమైందని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. బీజేపీలో ధనవంతులు, కాంట్రాక్టర్లకే ప్రాతినిధ్యం అధికంగా ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల ఉన్నతికి బీజేపీ సహకరించడం లేదన్నారు.