కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తా – కోమటిరెడ్డి రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నికలో ధర్మమే గెలుస్తుందని..ఇక్కడి నుండే కేసీఆర్ పతనం ప్రారంభం కాబోతుందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి..ఈరోజు మునుగోడు లో ఏర్పాటు చేసిన బిజెపి సభ లో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రం మోసకారి, దగా కోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని ఆరోపించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానన్న ఆయన.. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని, కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధమని రాజగోపాల్ అన్నారు. పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని తెలిపాడు. బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడ్తరని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నడని మండిపడ్డారు. తాను అమిత్ షాను కలిసి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కు నిద్రపడ్తలేదని అన్నారు. రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారిందన్న రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.