కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు – కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మునుగోడు సభ ఫై కేసీఆర్ ఫై విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు అంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేసారు. నిన్న మునుగోడు సభలో కేసీఆర్ వేసిన ప్రశ్నలకు , వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

అవినీతిపరులే ఈడీ కి భయపడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారన్నారు. మునుగోడు పులిబిడ్డ, నల్లగొండ ముద్దుబిడ్డ రాజగోపాల్‌రెడ్డి అని కిషన్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్‌ ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా బీజేపీ కి ఉందన్నారు. కేసీఆర్‌ శనివారం మునుగోడులో ఎందుకు సమావేశం పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని.. కేసీఆర్‌ అవినీతి పాలనకు చరమగీతం పాడటానికి అమిత్‌షా వచ్చారని కిషన్‌రెడ్డి తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ తల్లి విముక్తి కావాలని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రం రూ. 750 కోట్లు ఇచ్చిందని.. అది కూడా రాష్ట్రం ఇచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పటం సిగ్గుచేటు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.