రేవంత్ సారీ చెప్పిన వెనక్కు తగ్గని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అద్దంకి దయాకర్ వ్యాఖ్యల ఫై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పారు. అయితే రేవంత్ క్షమాపణ అంగీకరించేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. అద్దంకి దయాకర్ ను శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాతే క్షమాపణల గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పడం సంతోషమేనని వెంకట్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ గురించి మీడియా ద్వారానే తెలిసిందన్నారు.

‘‘ఉద్యమకారుడినైన నన్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించింది ’’ అని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేస్తేనే… మునుగోడులో ప్రచారానికి వెళ్తానని తెలిపారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అంటే తమాాషా అనిపిస్తుందా.. చిన్న పిల్లాడిలా మాట్లాడారని చెప్పారు. సారీ చెప్తే సరిపోదని కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన వెంటనే.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కూడా సారీ చెప్పారు. చండూరు బహిరంగ సభలో తాను మాట్లాడిన అభ్యంతరకర మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘నా నోటి నుంచి మరో సారి ఇలాంటి మాటలు రావు’ అని ఆయన హామీ ఇచ్చారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు చేయాలన్నారు.