గొప్ప మనసు చాటుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. హైదరాబాద్‌ కుషాయిగూడలో ఆదివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో.. చిన్నారి సహా దంపతులు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నరేష్‌, అతడి భార్య సుమ, కుమారుడు జస్విత్‌ మృతి చెందారు. వీరి స్వగ్రామం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, రెడ్డిగూడెం.

ఈ క్రమంలో సోమవారం.. నరేష్‌ స్వగ్రామంలో వీరికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన నరేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు హాత్విక్‌ కాగా.. రెండో కుమారుడు జస్విత్‌. అయితే అగ్నిప్రమాద ఘటనలో జస్విత్‌ మృతి చెందాడు. ఆ సమయంలో హాత్విక్‌ ఇంట్లో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. హాత్విక్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తన పీఏ ద్వారా.. హాత్విక్‌ పేరిట బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్‌ చేయించారు. ఇక ఖర్చుల నిమిత్తం… నరేష్‌ తల్లిదండ్రులకు 25 వేలు అందజేసే ఏర్పాటు చేశారు. నరేష్‌ తల్లిదండ్రులకు కాల్‌ చేసి వారితో మాట్లాడి ఓదార్చారు. కొడుకు పోయిన బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని.. ధైర్యంగా ఉండమని నరేష్‌ తల్లిదండ్రులకు చెప్పారు. కోమటిరెడ్డి నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.