ప్రజా సమస్యలను గాలికొదిలేసి టీడీపీ అనవసర విషయాలపై దృష్టి సారిస్తోంది – కొడాలి నాని

టీడీపీ పార్టీ ప్రజా సమస్యలను గాలికొదిలేసి అనవసర విషయాలపై దృష్టి సారిస్తున్నారని మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో మాధవ్ కు సంబదించిన వీడియో అంటూ ఓ న్యూడ్ వీడియో వైరల్ గా మారింది. దీనిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. పలు కుల సంఘాలు , పార్టీల కార్య కర్తలు పెద్ద ఎత్తున రోడ్డు పైకి వచ్చి మాధవ్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు.
కాగా దీనిపై ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఇక గోరంట్ల మాధవ్‌పై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీ కీలక నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని గోరంట్ల మాధవ్ చెబుతున్నా… సిగ్గు లేకుండా టీడీపీ నేతలు ఇంకా వాదిస్తున్నారని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనవసర విషయాలపై టీడీపీ నేతలు దృష్టి పెట్టడం సిగ్గు చేటని ఆయన అన్నారు.
ఎంపీ మాధవ్‌దిగా చెబుతున్న వీడియో ఫేక్ అని పోలీసులు చెబుతున్నా.. టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని నాని ఆరోపించారు. టీడీపీ నేతలు ఏమైనా లింగ పరిశోధనలో నిష్ణాతులా? అని కూడా ఆయన ప్రశ్నించారు. మాధవ్ వీడియోను పట్టుకుని టీడీపీ వేలాడినా…. వైస్సార్సీపీని గానీ, జగన్‌ను గానీ టీడీపీ ఏమీ చేయలేదని ఆయన అన్నారు. తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసి వచ్చినా వైస్సార్సీపీని ఏమీ చేయలేరంటూ ఆయన ఎద్దేవా చేశారు.