గుత్తాకు తనను విమర్శించే అర్హత, నైతిక హక్కు లేదు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

టీఆర్ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికు తనను విమర్శించే అర్హత, నైతిక హక్కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో ..మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ క్రమంలో అన్ని పార్టీ లు మునుగోడు ఫై ఫోకస్ చేసాయి.

ఈ క్రమంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి..తన ఫై చేసిన వ్యాఖ్యల ఫై మండిపడ్డారు రాజగోపాల్. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్‌లో చేరిన గుత్తాకు తనను విమర్శించే అర్హత, నైతిక హక్కు లేదన్నారు. తాను కాంట్రాక్టుల కోసం పార్టీ మారలేదన్నారు. వాటి కోసమే పార్టీ మారాలనుకుంటే ఎప్పుడో మారి ఉండేవాడినని అన్నారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.