ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కొడాలి నాని

సీఎం జగన్ కు పాదాభివందనం చేస్తున్నా: కొడాలి నాని

గుడివాడ: మంత్రి కొడాలి నాని గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని కొనియాడారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎన్టీఆర్ అభిమానుల తరపున జగన్ కు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరును ప్రకటించడాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని… దీన్నిబట్టి ఎన్టీఆర్ పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థమవుతోందని అన్నారు. ప్రతిపక్షం ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఉండాలని… కానీ, చంద్రబాబు మాత్రం ఎప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేస్తుంటారని విమర్శించారు.

గుడివాడలో తనను ఓడించడానికే టీడీపీ నేతలు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదని… వారికి అన్ని విషయాలు తెలుసని అన్నారు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని… టీడీపీ ఛీర్ బాయ్స్ రాద్ధాంతం చేస్తున్నారని, పోలీసులకు వాళ్లు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కేసినో వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు కూడా ఫిర్యాదు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/