ఈట‌లను ఆలింగనం చేసుకున్న టీఆర్ఎస్ ఎంపీ

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. తాజాగా తెరాస ఎంపీ కేకే, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో అదే జరిగింది. తెరాస ను వీడి బిజెపి తీర్థం పుచ్చుకున్న ఈటెల..హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయడంఖా మోగించారు. ఎన్నికల సమయంలో తెరాస నేతలంతా ఒకటై..ఈటెల ఫై మాటల దాడి చేసారు. ఫలితాల అనంతరం అంత చల్లబడ్డారు. అప్పుడప్పుడు మాటలు అనుకుంటారు తప్ప మనసులో ఎవరిపై ఎవరికీ కోపం లేదు.

హైదరాబాద్​లో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కుమారుడి వివాహా వేడుకను నిర్వహించారు. నూతన దంపతులను ఆశీర్వదించడానికి పలు పార్టీల రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఎంపీ కేకే, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితర నాయకులు హాజరయ్యారు. కేశ‌వ రావు ఈటల రాజేంద‌ర్ ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడగా..ఇద్దరు మాట్లాడుకున్నారు. అలాగే ఆలింగ‌నం కూడా చేసుకున్నారు. దీంతో వారి చుట్టు ప‌క్క‌ల ఉన్న వారంతా ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు.

ఒక్క ఆలింగనం వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో చెప్పింది. కొన్నేళ్ల పాటు ఒకే పార్టీలో ఉండి కలిసి పనిచేశారు. సీనియర్, జూనియర్ అనే భేదాలకు ఏనాడు వెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో పాలుపంచుకున్నారు. కానీ కాలం మారింది. అనుకోని విధంగా వారిద్దరి పార్టీలు వేరయ్యాయి. ఒకే పార్టీలో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఏ విధమైన అనుబంధముందో… ఇప్పుడు కూడా అలానే ఉందనిపించింది. ఆ ఆలింగనం వారి మధ్య అనుబంధం ఎలాంటిదో చాటి చెప్పింది.