జీహెచ్ఎంసీ అధికారులపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆరు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని అఘాపుర ప్రజల ఫిర్యాదు

kishan-reddy

హైదరాబాద్‌ః కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మల్లేపల్లి డివిజన్ అఘాపురలో గత ఆరు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. గత నవంబర్ లో అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని చెప్పారు.

దీంతో, అధికారులపై కేంద్ర మంత్రి కన్నెర్రజేశారు. పనులు సక్రమంగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు అలసత్వం అని నిలదీశారు. అయితే, పనులు చేపట్టడానికి నిధులు లేవని ఆయనకు అధికారులు తెలిపారు. వెంటనే ఆయన అక్కడి నుంచే జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేశారు. అఘాపురలో వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటాలని బిజెపి నేతలు పట్టుదలతో ఉన్నారు. వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కీలక నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.