బ్రిటన్ రాజుకు క్యాన్సర్‌..బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడి

ఇది ఏ తరహా క్యాన్సర్ అనేది వెల్లడించని వైనం

King Charles III diagnosed with cancer, Buckingham Palace says

లండన్‌ః బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి (75) క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ తాజాగా వెల్లడించింది. ఆయన చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. అయితే, ఆయన వ్యాధి ఏ రకమైనదో మాత్రం వెల్లడించలేదు. ‘‘ఇటీవల రాజుకు ప్రోస్ట్రేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేస్తుండగా వేరే సమస్య బయటపడింది. అదనపు పరీక్షల తరువాత క్యాన్సర్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది ప్రోస్ట్రేట్‌కు సంబంధించిన క్యాన్సర్ కాదని ప్యాలెస్ స్పష్టం చేసింది.

గత నెలలో బ్రిటన్ రాజు ప్రోస్ట్రేట్‌ గ్రంధి సమస్యతో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. కాగా, రాజు కోడలు, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ కూడా ఇటీవల ఉదర భాగంలో సర్జరీ చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 మరణం తరువాత ఆమె కుమారుడు ఛార్లెస్ 2022లో సింహాసనాన్ని అధిష్ఠించిన విషయం తెలిసిందే.

మరోవైపు, బ్రిటన్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని రిషి సునాక్ సోషల్ మీడియాలో స్పందించారు. త్వరలో ఆయనకు పూర్తి ఆరోగ్యం చేకూరి ప్రజాజీవితంలో భాగమవుతారని అన్నారు.