బిఆర్ఎస్ షాకిచ్చిన ఎంపీ వెంకటేష్ నేత..కాంగ్రెస్ లో చేరిక
హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ పార్టీకి సీనియర్ నేత, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షాకిచ్చారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిఆర్ఎస్ లో ఈసారి సిట్టింగ్ లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్ఠానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేశ్ నేత పార్టీ మారినట్లు తెలుస్తోంది. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేశ్.. తొలుత కాంగ్రెస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా బిఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.