సూర్యదేవ్‌కు ఖేలో ఇండియాలో కాంస్యం

Surya dev won bronze medal
Surya dev won bronze medal

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ జట్టు ఖాతాలో మరో పతకం చేరింది. వరుసగా రెండు రోజులు స్వర్ణాలతో మెరిసిన తెలంగాణ ప్లేయర్లు.. మూడో రోజు కాంస్య పతకం సాధించారు. అండర్‌21 బాలుర జిమ్నాస్టిక్స్‌ స్టిల్‌ రింగ్స్‌ విభాగంలో జిమ్నాస్ట్‌ పేర్న సూర్యదేవ్‌ కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో సూర్యదేవ్‌ 11.70 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కేరళకు చెందిన జిమ్నాస్ట్‌ స్వతీశ్‌ (12.35) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇక యూపీకి చెందిన సందీప్‌ పాల్‌ (11.95)కు రజతం దక్కింది. నాలుగేండ్ల వయసు నుంచే జిమ్నాస్టిక్స్‌కు ఆకర్షితుడైన సూర్య.. పట్టుదలతో ఆడి జాతీయ స్థాయికి చేరాడు. జూనియర్‌ లెవల్లో రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు కూడా సాధించాడు. పామెల్‌ హార్స్‌ ఈవెంట్‌లో తెలంగాణకే చెందిన విశాల్‌ జాదవ్‌ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. ఇక బాలికల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గిన జివాంజి దీప్తి.. 200 మీటర్లలోనూ సత్తాచాటింది. సెమీఫైనల్స్‌లో 25.30 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని మంగళవారం జరుగనున్న తుదిపోరుకు అర్హత సాధించింది. మరోవైపు లాంగ్‌జంప్‌లో పసిడి నెగ్గిన అగసర నందిని ఈరోజు 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో బరిలోకి దిగనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/