మరికాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకులు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి మండపాల నుంచి తీసుకువెళ్తున్నారు. దారి పొడవునా బ్యాండ్ బాజాలతో, నృత్యాలతో కోలాహలం చేస్తూ వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఇక మరికాసేపట్లో ఖైరతాబాద్‌ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం కానుంది. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. 50 అడుగుల ఎత్తు, 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరాడు. వాస్తవానికి ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభించాలని అనుకున్నారు కానీ రాత్రి భారీ వర్షం పడడంతో శోభాయాత్ర ఆలస్యమైంది.

ప్రస్తుతం ట్రాలీపై వెల్డింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. తుది పూజల అనంతరం గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించనున్నారు. ఇప్పటికే త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలను ట్రాలీపైకి చేర్చారు. కాగా, సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్‌ మహాగణపతిని తరలించేందుకు ఈ ఏడాది అత్యాధునిక ట్రాలీ వాహనాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి ఏడాది మాదిరి ఖైరతాబాద్‌ గణేశుడిని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేయనున్నారు. ఇక శోభాయాత్ర ఖైరాతాబాద్ సెన్షెన్‌ థియేటర్‌, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ట్యాంక్‌బండ్‌పైకి మొత్తం 2.5 కిలోమీటర్లు సాగుతుంది. మధ్యాహ్నం 3 గంటలలోపే నిమజ్జనం పూర్తికానుంది.