ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై డీజీపీకి చంద్రబాబు లేఖ

గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల నందమూరి ఫ్యామిలీ తో పాటు తెలుగుదేశం నేతలు , కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాసారు.

ఈ దాడులు ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని, మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు అలసత్వం ప్రదర్శించడం తగదని లేఖ లో పేర్కొన్నారు. వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టే కుట్రలో భాగంగానే వైకాపా జడ్పీటీసీ సెట్టిపల్లి యలమంద ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.

‘ఈ తరహా ఘటనలు పునరావృతమైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. అధికార వైకాపా నాయకుల అండదండలతోనే ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో జూన్ 2019 నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నంలో అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు’ అని రాసారు. ఇలాంటి విధ్వంసాలను ప్రోత్సహించడంలో పోలీసులు నిందితులకు సహకరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఫిర్యాదులపై విచారణ జరిపి దోషులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చూడాలి. పోలీసులు తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే నేరస్తులను నిరోధించగలవు’ అని లేఖలో అభిప్రాయపడ్డారు.

అలాగే ఈ ఘటన పట్ల ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఘాటుగా స్పందించారు. తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు మహాపురుషిని ఈ సందర్భంగా కీర్తించారు. తెలుగు మహాపురుషుని విగ్రహం ధ్వంసం చేయటం అంటే మన తెలుగు జాతిని అవమానించినట్లేనని రామకృష్ణ చెప్పారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎన్.టి.ఆర్ విగ్రహంపై చేయి వేస్తే తెలుగు జాతి ఊరుకోదని రామకృష్ణ అన్నారు.