ఆ ఘనమైన రికార్డును కెసిఆర్ సాధించబోతున్నారుః కెటిఆర్‌

దక్షిణాదిన ఎవరూ వరుసగా మూడుసార్లు సీఎం కాలేదు

minister-ktr

హైదరాబాద్‌ః కెసిఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని, వరుసగా మరోసారి ఆయన సీఎం కాబోతున్నారని మంత్రి కెటిఆర్ చెప్పారు. దక్షిణాదిన వరుసగా మూడుసార్లు ఎవరూ సీఎం కాలేదని… ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలకు కూడా అది సాధ్యం కాలేదని… ఆ ఘనమైన రికార్డును కెసిఆర్ సాధించబోతున్నారని అన్నారు. తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని… కెసిఆర్ చేస్తున్న అభివృద్ధే బిఆర్ఎస్ ను గెలిపిస్తుందని చెప్పారు. దేశంలోని మొత్తం జనాభాలో తెలంగాణలో 3 శాతం కంటే తక్కువ జనాభా ఉందని… అయితే కేంద్ర సర్కారు తెలంగాణకు 30 శాతం అవార్డులు ఇస్తోందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుండటం వల్లే కేంద్ర ఇచ్చే అవార్డులు వస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో బిఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని… అయితే ఆ పార్టీలను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కెటిఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిపోతాడని ఓ పత్రిక నమ్ముతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎందుకు రాయడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయుడని… గోవా టూర్లు, పర్యటనలకే ఆయన పనికొస్తారని అన్నారు. మాట్లాడితే రూ. 1.80 లక్షల కోట్ల నేషనల్ హైవేలు అంటారని… టోల్ కట్టకపోతే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లు పాలించినా సాగునీరు ఇవ్వని ఒక సన్యాసి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ప్రతి రంగాన్ని పట్టించుకున్నామని… పల్లెలు. పట్టణాలు, వ్యవసాయం, ఐటీ ఇలా ఏ రంగాన్ని విస్మరించలేదని కెటిఆర్ చెప్పారు. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్న బిఆర్ఎస్ కు ప్రజలు ఓటు ఎందుకు వేయకూడదని అన్నారు.