హైదరాబాద్ లో నేడు 3 టీమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేయబోతున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సర్కార్ హైదరాబాద్ లో 3 ప్రాంతాల్లో 3 టిమ్స్‌ ఆసుపత్రులను నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఆ మూడు ఆసుపత్రులకు సంబదించిన శంకుస్థాపన ఈరోజు సీఎం కేసీఆర్ చేయబోతున్నారు. నగరంలోని సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్వాల్‌లలో టిమ్స్‌ ఆసుపత్రులకు కేసీఆర్‌ పునాది రాళ్లు వేయనున్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ స్థానంలో అధునాతన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం ఉదయం 10.45 గంటలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ మేరకు దవాఖాన స్థలాన్ని, ఏర్పాట్లను ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం పరిశీలించారు.

అనంతరం ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించబోయే ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేయనున్నారు. తర్వాత ఆల్వాల్‌కు చేరుకుని మరో భూమి పూజ చేసి, అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దూలపల్లిలోని ఆయన నివాసంలో ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ, మేడ్చల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు శంభీపూర్‌ రాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్‌, సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చించారు. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లలో కాకుండా అల్వాల్‌లో సీఎం సభ ఏర్పాటు చేశారు.