మునుగోడు సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ అధినేత కేసీఆర్..మునుగోడు లో జరగబోతున్న ప్రజాదీవెన సభ కు హైదరాబాద్ నుండి బయలుదేరారు. సుమారు నాల్గు వేల వాహనాలతో కేసీఆర్ మునుగోడు సభకు బయలుదేరారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. మరోపక్క సభావేదికతోపాటు మునుగోడు మొత్తం గులాబీమయమైంది. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.

సీఎం సభ కోసం 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50మంది సీఐలు, 94 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొననున్నారు. సీఎం సభతో చర్లగూడెం, కిష్టరాయిన్ పల్లి భూ నిర్వాసితులను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ఐదురోజులుగా మునుగోడులో దీక్ష చేస్తున్న వారిని అర్ధరాత్రి 2గంటలకు అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభను అడ్డుకుంటారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో.. మఫ్టీలో పోలీసులను సభా ప్రాంగణంలో మోహరించారు.

ఇదిలా ఉంటె మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ కు సిపిఐ సపోర్ట్ ఇస్తుంది. బీజేపీని ఓడించే సత్తా టీఆర్‌ఎస్‌కే ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తాము టీఆర్‌ఎస్‌కు మద్దుతు పలుకుతున్నామని చెప్పారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్నారు.