మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆగ్రహం

తెలంగాణ మంత్రి హరీష్ రావు ఫై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు మాట్లాడ‌టం స‌రికాద‌ని బొత్స కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేర‌కు హ‌రీశ్ రావు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ బొత్స ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

గురువారం ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు.. ఇరు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్‌కు కారణమయ్యాయి. ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తోందని.. కానీ తెలంగాణ సర్కార్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు ఫిట్‌మెంట్ ఇచ్చిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ ప్రభుత్వం అంటే.. రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపేసిందన్నారు. జగన్‌లా కేంద్రం మాటకు ఒప్పుకుని ఉంటే.. ఏటా 6 వేల కోట్లు వచ్చేవన్నారు. దీనిపై ఏపీ మంత్రి బొత్స స్పందించారు. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నార‌ని బొత్స అన్నారు. హ‌రీశ్ రావు ఒక సారి ఏపీకి రావాల‌ని, ఇక్క‌డి టీచ‌ర్ల‌తో మాట్లాడి వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని సూచించారు. తెలంగాణ‌, ఏపీ పీఆర్సీలు ప‌క్క‌ప‌క్క‌నే ప‌ట్టుకుని చూస్తే తేడా తెలుస్తుంద‌ని బొత్స వ్యాఖ్యానించారు.