26/11 తరహాలో ఉగ్ర దాడులు చేస్తాం..ముంబయి పోలీసుల‌కు బెదిరింపు మెసేజ్‌

mumbai terror attack
mumbai terror attack

ముంబయిః 26/11 ఉగ్రదాడి తరహాలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిపై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ముంబయి పోలీస్​ ట్రాఫిక్​ కంట్రోల్​ రూంకు ఒక మెసేజ్​ వచ్చినట్లు వారు వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబ‌ర్ నుంచి బెదిరింపు మెసేజ్ వ‌చ్చింది. భార‌త్‌లో విధ్వంస ప్ర‌ణాళిక‌లో ఆరుగురు వ్య‌క్తులు నిమ‌గ్న‌మ‌య్యార‌ని ఆ మెసేజ్ పేర్కొంది.

ఈ వ్య‌వ‌హారంపై ముంబయి పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. బెదిరింపు మెసేజ్‌పై ఇత‌ర ఏజెన్సీల‌నూ అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గ‌ఢ్ తీరంలో గురువారం బోటులో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్స్ ప‌ట్టుబ‌డిన నేప‌ధ్యంలో బెదిరింపు మెసేజ్ రావ‌డం ప్రాధాన్య‌త సంతరించుకుంది. 26/11 ఉగ్ర‌దాడి త‌ర‌హాలో ప‌డ‌వ‌లో ఆయుధాలు ల‌భ్యం కావ‌డంతో ఉగ్ర‌ముప్పు పొంచిఉంద‌నే ఆందోళ‌న నెల‌కొంది. స్ధానిక పోలీసు అధికారుల‌తో పాటు యాంటీ టెర్ర‌ర్ స్వ్కాడ్ బృందాలు ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుని బోటు ఎక్క‌డినుంచి వ‌చ్చింద‌ని ఆరా తీస్తున్నారు. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బృందం కూడా ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/