మతం, కులం పేరుతో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు

గ్రేటర్ హైదరాబాద్ లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం భూమి పూజ చేశారు. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో 3 హాస్పిటళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారంలో టిమ్స్ కు భూమి పూజ చేశారు. ఆ తర్వాత సనత్ నగర్ లోని చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్ నగర్ నుంచి అల్వాల్ వెళ్లి అక్కడ మరో టిమ్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అల్వాల్ లో టిమ్స్ కు భూమి పూజ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవీయకోణంతో చాలా కష్టపడి.. పోరాడి.. ఆరుదశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి.. దీన్ని అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో పటిష్ట పరిచేందుకు సరైన పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు. పేదరకం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని, హెచ్‌ఎండీఏ పరిధిలో 1.64కోట్ల జనాభా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ, ఉసాన్మియా కాకుండా మరో నాలుగు ఆసుపత్రులు ఉండాలని నిర్ణయించామని, అన్ని రకాల వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు ప్రజలకు అందుతాయన్నారు. అల్వాలలో మహిళల ప్రసూతి వింగ్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

గతంలో ఏం జరిగిందో.. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కొందరు మతం మీద, కొందరు కులంపేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. దేశం అన్ని మతాలను, అన్నీ కులాలను సమాంతరంగా ఆదరించే గొప్ప భారతదేశం. దీన్ని చెడగొట్టుకుంటే, ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుకాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్‌ జబ్బు మనకుపట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఈ రోజు అనేక విషయాలు ఇవాళ పేపర్లలో చూస్తున్నరు. పలాన వాళ్ల షాపులో పువ్వులు కొనద్దు.. పలాన వారి షాపులో ఇది కొనద్దు.. అది కొనద్దని చెబుతున్నరు దీనిపై ప్రజలు ఆలోచన చేయాలి. మన భారతీయులు 13కోట్ల మంది విదేశాల్లో పని చేస్తున్నరు. ఒక వేళ వారందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్లందరికీ ఉద్యోగాలు ఎవరివ్వాలి. ఎవరు సాదాలి? అని ప్రశ్నించారు.