బూట్లు మోసే వెధ‌వ‌ల‌కు బుద్ధి చెప్పాలి – సీఎం కేసీఆర్

గులామ్‌లు, దోపిడీ దొంగ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని , దొంగ‌ల బూట్లు మోసే స‌న్నాసులు తెలంగాణ‌లో క‌న‌బ‌డుతున్నారు. వారి ప‌ట్ల కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలని , అలాంటి వేదవులకు బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంగా మోడీ ఫై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘మోసపోతే గోసపడతాం.. గుజరాత్ గులాంలా బూట్లు మోసే సన్నాసులు మన దగ్గర ఉన్నారు. ఆ చెప్పులే మోసేవాళ్లు దుర్మార్గులు. వాళ్లే ప్రజలను రెచ్చగొడుతున్నారు. వీళ్లను వీలైనంత త్వరగా గద్దె దించకపోతే దేశాన్ని ఆగం ఆగం చేస్తారు. బీజేపీ ముక్త్ భారతదేశం కోసం అందరూ కదలాలి’ అని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టుపెడుదామా? ద‌య‌చేసి ఆలోచించండి. 26 రాష్ట్రాల రైతులు త‌మ‌కు చెప్పారు. మా వడ్లు కొన‌రు అని చెప్పారు. ఢిల్లీలోనే నేనే స్వ‌యంగా ధ‌ర్నా చేశాను. ధాన్యం కొనేందుకు మోదీకి చేత కాదు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో నూక‌ల‌కు, గోధుమ‌ల‌కు షార్టెజ్ వ‌స్తుంది. ప‌రిపాల‌న చేత‌గాక దేశ ఆర్థిక స్థితిని దిగ‌జారుస్తున్నారు. మోస‌పోతే గోస ప‌డుతాం. ఒక్క‌సారి దెబ్బ‌తింటే చాలా వెన‌క్కి పోతాం. కూల‌గొట్ట‌డం చాల అలుక‌.. క‌ట్టడ‌మే చాలా క‌ష్టమ‌ని కేసీఆర్ అన్నారు.