యాసంగి వడ్లను మేమే కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటన

యాసంగి వడ్లను మేమే కొనుగోలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం, మంత్రులు చర్చించి ఆమోదముద్ర వేశారు.

సమావేశం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్రంలో పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని తెలిపారు. దేశంలో దొంగ‌ల కోసం ప‌దిన్న‌ర ల‌క్షల కోట్లను మాఫీ చేసిన కేంద్ర‌ ప్ర‌భుత్వం.. రైతుల కోసం రూ. 3 వేల కోట్లు ఖ‌ర్చు చేయలేదా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఆహార భద్రత లో భాగంగా దేశంలో ధాన్యం సేకరణ బాధ్య‌త కేంద్రానిదే అని అన్నారు. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వమే భ‌రించాల‌ని అన్నారు. కానీ నేటి కేంద్రం తప్పించుకుంటుందని విమ‌ర్శించారు. రైతులు పండించిన వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయ‌డానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా.. ప్రధానికి మనస్సు లేదా అని ప్రశ్నించారు.

కేంద్రం పంట కొనడం చేతకాక తెలివి తక్కువ మెలికలు పెడుతుందన్నారు. వ్యవసాయాన్ని కార్పోరేట్లకు అప్పగించాలని కేంద్రం కుట్ర చేస్తుందన్నారు. ఎరువుల ధరలు విపరీతంగా పెంచారని.. తెలంగాణకు ఉన్న స్థాయి కేంద్రానికి లేదన్నారు. రైతులను అవమాన పరిచి చివరకు చట్టాలను వెనక్కు తీసుకున్నారని.. కేంద్ర అసమర్ధతను ఇతరులపై నెట్టేస్తుందన్నారు. కొనుగోళ్లపై కేంద్రం పిచ్చిగా వ్యవహరిస్తోందని.. మేం వచ్చిన తర్వాత పెట్రోల్ పై వ్యాట్ పెంచలేదని తెలిపారు. యాసంగి వడ్లను కొనాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఊళ్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. రెండు , మూడు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. క్వింటా వడ్లకు రూ 1960 రైతులు చెల్లిస్తామని తెలిపారు. రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మొద్దని సూచించారు.