ఆదివాసీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ -10లో కొత్తగా నిర్మించిన కొమురం భీం ఆదివాసీ భవనాన్ని శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. వీటి నిర్మాణం కోసం దాదాపు రూ.50 కోట్ల నిధులను ఖర్చుచేసింది.
జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్ హాల్స్, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్, థోటి, నాయక్‌పోడ్, చెంచు ఇలా 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ భవనాలు రూపుదిద్దుకున్నాయి.
ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..ఆదివాసీ బిడ్డలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అస్తిత్వాన్ని కోల్పోయిన తెంలగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొని సొంత రాష్ట్రంగా వచ్చిన ఈ సందర్భంలో ఆదివాసీ గిరిజన బిడ్డలు, లంబాడీ బిడ్డలు అందరికీ కూడా మేం తల ఎత్తుకుని ఇది మా రాష్ట్రం, ఇది మా కుమ్రం భీం ఆదివాసీ భవన్ అని చెప్పుకునేటటువంటి మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం.
తెలంగాణ వస్తే ఏం జరుగుతదనే మాట ఉద్యమ సందర్భంలో చాలా చోట్ల చెప్తూ వచ్చాను. అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. మన రాజధాని నగరంలో బంజారాహిల్స్ అనే గొప్ప ప్రాంతం ఉంటది. కానీ బంజారాలకే గజం జాగ లేదని చెప్పాను. ఆ మాట తారుమారు చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డల గౌరవం ఈ జాతి మొత్తానికి తెలిసే విధంగా భవనం నిర్మించుకున్నాం. మనం ఈ రోజు ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది భారతదేశ గిరిజన జాతి అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన బాట పట్టాయి. అన్ని చోట్ల గిరిజన బిడ్డలకు గౌరవం లభించే విధంగా దశ దిశ చూపిస్తుందని భావిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.