ఈ నెల 24న ఔరంగాబాద్‌లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

మహారాష్ట్ర ఫై కేసీఆర్ పూర్తి ఫోకస్ పెట్టారు. మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన చీలికతో ఆ పార్టీ బలహీనపడింది. బీజేపీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా అంత బలంగా కనిపించడం లేదు. రాజకీయ అనిశ్చిత నెలకొన్న నేపథ్యంలో మహారాష్ట్రపై కేసీఆర్ నజర్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు భారీ బహిరంగ సభలు ఏర్పటు చేసి , పెద్ద ఎత్తున నేతలను పార్టీ లో ఆహ్వానించగా..తాజాగా ఈ నెల 24న ఔరంగాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచించారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఔరంగాబాద్ సభకు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు. దీంతో కేసీఆర్ సూచనతో ఎమ్మెల్యే షకీల్ హుటాహుటిన ఔరంగాబాద్‌కు బయలుదేరారు. ఈ సభ సక్సెస్ అయ్యేలా చూడాలని నేతలకు కేసీఆర్ సూచించారు. నాందేడ్‌లో తొలి సభను నిర్వహించగా.. ఇటీవల నాందేడ్ జిల్లాలోని లోహ పట్టణంలో సభ జరిపారు. ఇప్పుడు కొద్ది రోజుల వ్యవధిలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరో సభ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.