జగన్ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్ల లో పలు అనుమానాలు..

ఏపీ రాష్ట్ర మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ వెనకడుగు వేసింది. మూడు రాజధానుల చట్టం తో పాటు సిఆర్డేఏ చట్టాన్ని రద్దు చేస్తునట్టు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. న్యాయపరంగా మెరుగైన బిల్లులతో మళ్ళీ సభ ముందుకు వస్తుందని వెల్లడించారు. సమూలమైన మార్పులతో మరోసారి ప్రజా ఆమోదంతో సమగ్రమైన బిల్లు ప్రవేశపెట్ట నున్నామని అన్నారు. ఈ నిర్ణయం తో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే.. తెలుగు తమ్ముళ్ల లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు కోర్టులో మూడు రాజధానుల బిల్లులు నిలబడవని తెలిసే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తుంటే, మరికొందరు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు నుండి జనం దృష్టి మరల్చటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. తాజాగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు..జగన్ నిర్ణయం ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇంత సడన్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ప్రజలను గందరగోళంలోకి నెట్టకుండా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడుతుందని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి మరో నాటకానికి తెర లేపుతున్నారు. రాజధాని అమరావతి పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాటం సాగిస్తూనే ఉంటుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.