అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్ కు లేదు – బండి సంజయ్

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున.. హుస్సేన్ సాగర్ తీరాన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. 2016 ఏప్రిల్ 14న అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటన మేరకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విగ్రహ నిర్మాణం చేపట్టింది. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్ కు లేదన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.

కేసీఆర్ దళిత ద్రోహి అని , దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని సంజయ్ ఫైర్ అయ్యారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాని కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్.. వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే.. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని, దానిపైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

దళిత బంధు పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ దళిత బంధుకు ఎన్ని నిధులు కేటాయించారో..? ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో స్పష్టం చేయాలని కోరారు. గత ఎనిమిదేండ్లుగా అంబేద్కర్ సేవలను, ఆశయాలను గుర్తించని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల సంవత్సరం సందర్భంగా.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయాన్ని దళిత సమాజం గుర్తించుకోవాలని కోరారు. ఏనాడు కూడా అంబేద్కర్ ఆశయాలను సమాజానికి వివరించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదన్నారు.