యాసంగి సీజన్‌లో రైతు బంధుకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు తీపి కబురు తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము ఖాతాలో జమకానుంది. సుమారు 7,500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.

అంటే మరో పది రోజుల్లో రైతు బంధు సొమ్ము ఖాతాల్లో పడనుంది. గతంలో పంపిణీ చేసిన తరహాలోనే భూమి విస్తీర్ణం వారీగా రైతు బంధు నిధులు జమ చేసే అవకాముంది. గత సీజన్‌లో రైతు బంధు కోసం 7,360 కోట్లు జమ చేయగా.. ఈ సారి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులను కలుపుకుని రూ.7.500 కోట్లు అవసరం కాబోతున్నాయి.