డిసెంబర్ నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు

cm kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ నుంచి జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలుకాబోతుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన మొదలుపెట్టబోతున్నారు. డిసెంబర్ మొదటి వారంలో మహబూబ్‌నగర్, జగిత్యాలలో రెండు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత మహబూబాబాద్‌లో మరో బహిరంగ సభ నిర్వహించేలా టీఆర్‌ఎస్ రోడ్ మ్యాప్ సిద్దమయింది. డిసెంబర్ 4న ఉమ్మడి పాలమూరులో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మహబూబాబ్ నగర్ జిల్లా నాయకత్వం ఈ సభ పనుల్లో బిజీ అయ్యారు.

ఇక డిసెంబర్ 7న జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల మందితో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించిన బాధ్యతలను ఎమ్మెల్సీ కవితకు అప్పగించినట్టు తెలుస్తోంది. పోడు భూముల సమస్యతో పాటు గిరిజన బంధు పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేసేందుకు కేసీఆర్ ఈ బహిరంగ సభను ఉపయోగించుకునే అవకాశం ఉందని సమాచారం.

ఇక డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వారం రోజులపాటు ఉభయ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రమే లక్ష్యంగా ఈ సమావేశాలు ఉండాలనేది కేసీఆర్ ప్లాన్. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం ఏవిధంగా నష్టపోతోందో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వివరించే అవకాశం ఉంది. పైగా ఎమ్మెల్యేల ఎర కేసు విషయం ఎలాగూ హీట్ పుట్టిస్తోంది. దీనిపైనా కేంద్రాన్ని కార్నర్ చేసి బీజేపీని బద్నాం చేయాలని అనుకుంటున్నట్లుగా రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.