షేక్ పేట ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన కేటీఆర్

కొత్త ఏడాది రోజున హైదరాబాద్ సరికొత్త ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించిన షేక్ పేట ఫ్లై ఓవర్ ను శనివారం తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి. ఏడున్నారేళ్లుగా SRDP కింద హైదరాబాద్ మహానగరంలో 24 కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్న మంత్రి.. ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చాలా పురోగతి సాధించాం అన్నారు.

అతి పొడవైన ఆరు లేన్ల షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను దాదాపు రూ.333.55 కోట్లతో 2.71 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. దాదాపు 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లుగా టూ వే ట్రాఫిక్‌ను ఏర్పాటు చేశారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ ప్రధానంగా నాలుగు ప్రధాన జంక్షన్లను కవర్ చేయనుంది. షేక్‌పేట్, ఫిలింనగర్, ఓయూ కాలనీ, విస్పర్ వ్యాలీ జంక్షన్‌లు దాటి నేరుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కారణంగా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పై హైదరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.