దేవుడి దయవల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి బతికి బయటపడ్డారుః సిఎం కెసిఆర్‌

హత్యా రాజకీయాలను సహించేది లేదని హెచ్చరిక

kcr-comments-on-attack-kotha-prabhakar-reddy

హైదరాబాద్‌ః మెదక్ లోక్ సభ సభ్యుడు, దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం పలువురు నేతలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ ఎంపీని చంపాలని చూశారని, అయినప్పటికీ దేవుడి దయవల్ల ఆయన బతికి బయటపడ్డారన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలను సహించేది లేదన్నారు.

హింసాత్మక ఘటనలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రతిపక్ష శక్తులు ఎన్నో ఉంటాయని, హేయమైన దాడులకు తగిన బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ అధ్భుత ప్రగతి సాధించిందన్నారు. ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రేరేపిస్తున్నాయని, మరోసారి బిఆర్ఎస్‌ను గెలిపించి ఇలాంటి శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిలు ఈ రోజు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. వీరిద్దరికి కెసిఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెసిఆర్ పైవ్యాఖ్యలు చేశారు.