తీహార్ జైలు నుండి 4 పేజీల లేఖ విడుదల చేసిన కవిత

ED to produce BRS leader Kavitha before Delhi court

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తీహార్ జైల్లో జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత నాలుగు పేజీల లేఖ విడుద‌ల చేశారు. లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదని , ఈడీ వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని… లిక్కర్ కేసులో నేను బాధితురాలని అంటూ చెప్పుకొచ్చారు.

రెండేళ్ల నుంచి కేసు విచారణ ఎటు తేలడం లేదని… మీడియా ట్రయిల్ ఎక్కువ జరుగుతుందని వివరించారు. సిబిఐ ఈడి ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని.. నా రాజకీయ పరపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని తెలిపారు. నా మొబైల్ నెంబర్ ను అన్ని ఛానల్ వేసి నా ప్రైవసీ భంగం కలిగించారని కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈడీ, సీబీఐ అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పాను. ఇప్ప‌టికే నాలుగు సార్లు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాను. బ్యాంకు వివ‌రాల‌తో పాటు ఇత‌ర బిజినెస్ వివ‌రాల‌ను కూడా ఇచ్చాను. గ‌త రెండున్న‌రేండ్ల నుంచి విచార‌ణ పేరుతో మాస‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారు. ఇవాళ ఈడీ, సీబీఐ కేసుల‌ను ప‌రిశీలిస్తే.. ఒక 95 శాతం కేసులు ప్ర‌తిప‌క్ష పార్టీల‌పైనే ఉన్నాయి. బీజేపీలో చేరిన వెంట‌నే కేసుల విచార‌ణ ఆగిపోతుంది. పార్ల‌మెంట్ సాక్షిగా విప‌క్ష నేత‌ల‌ను ఉద్దేశించి నోరు మూసుకోక‌పోతే ఈడీని పంపుతామ‌ని బీజేపీ నేత‌ల‌న్నారు. ఇలా బీజేపీ నాయ‌కులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ కేసులో విచార‌ణ‌కు స‌హ‌క‌రించేందుకు సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడి ప‌రీక్ష‌ల దృష్ట్యా బెయిల్ ఇవ్వాల‌ని మ‌ళ్లీ కోరుతున్నాను. ఎందుకంటే నా కుమారుడి బోర్డు ఎగ్జామ్స్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డొద్ద‌నే ఉద్దేశంతో, ఈ స‌మ‌యంలో త‌న‌తో నేను ఉండాలి. కాబ‌ట్టి బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నాన‌ని క‌విత లేఖ‌లో పేర్కొన్నారు.