రేపు సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయబోతున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కీమ్‌ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సుప్రీం కోర్టు లో పిటిషన్ వేయబోతున్నారు. రేపు (మార్చి 17) తాము దాఖలు చేసిన పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఈ నెల 20నే విచారణకు రావాలని ఈడీ స్పష్టం చేసిన నేపథ్యంలో కవిత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే ఈ పిటిషన్ పై మార్చి24న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ కవిత పిటిషన్ ను మార్చి 17న సుప్రీం విచారిస్తే ఆమెను ఈడీ విచారించడంపై స్పష్టత రానుంది.

కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఒక మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరుఫున న్యాయవాదులు వివరించారు. ఫోన్‌ సీజ్ వ్యవహారాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు కవిత. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్‌ ఫోన్లు సీజ్‌చేశారని కోర్టు దృష్టికి కవిత తీసుకెళ్లారు.