కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జరిమానా విధించిన హైకోర్టు..!

Karnataka CM Siddaramaiah fined by High Court..!

బెంగళూరు: కర్ణాటక సిఎం సిద్ధరామయ్య, కేబినెట్‌ మంత్రులు ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలాకు ఆ రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. మార్చి 6న సీఎం సిద్ధ రామయ్య, 7న రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, 11న కాంగ్రెస్‌ కర్ణాటక ఇన్‌చార్జి రణదీప్‌ సూర్జేవాలా, 16న పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్‌ కోర్టులో హాజరుకావాలని చెప్పింది. కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య కేసులో అప్పటి మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2022 ఏప్రిల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రస్తుత సీఎం సహా కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ బెలగావి వాసి కాగా.. ఆయన ఉడిపిలోని హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, తాను చేసిన పనులకు ఈశ్వరప్ప కమిషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపించారు. అయితే, ఈశ్వరప్ప ఆరోపణలను తోసిపుచ్చడంతో పాటు ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు. కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కేసులో మంత్రి రాజీనామా చేయాలని అప్పటి కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. అప్పటి సీఎం బసవరాజ్‌ బొమ్మై నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించా డీకే శివకుమార్‌తో సహా కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.