సిద్ధరామయ్యకు బెదిరింపు కాల్స్..విచారణకు సిఎం బసవరాజ్ బొమ్మై ఆదేశం

ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన సిఎం

Karnataka CM Bommai orders probe into death threat calls to Siddaramaiah

బెంగళూరుః కర్ణాటక మాజీ సిఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యను హతమారుస్తామని వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. తాను సిద్ధరామయ్యను కలిశానని, తగిన భద్రతతో పాటు సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చానని చెప్పారు. ఈ మధ్య కొడగు పర్యటనలో సిద్ధరామయ్య కారుపై గుడ్లు విసిరి, నల్ల జెండాలు ప్రదర్శించిన తర్వాత ఆయన భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని, దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సిద్ధరామయ్యకు హామీ ఇచ్చామని సీఎం బొమ్మై తెలిపారు. బెదిరింపు కాల్స్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని సిద్ధరామయ్యను కోరానని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తానని ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి డీజీపీతో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

‘ఈ విషయంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. ఇతరులను రెచ్చగొట్టేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ఎవరూ ప్రకటనలు చేయకూడదు. రెండు వర్గాలకీ చెబుతున్నాను. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వాలని డీజీపీని కోరాను. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడికి తగిన భద్రతను, అవసరం అయితే అదనపు భద్రత కల్పించాలని ఆదేశించాను’ అని బొమ్మై చెప్పుకొచ్చారు. అంతకుముందు, సిద్ధరామయ్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఈ వ్యక్తులు గాంధీని చంపారు, వారు నన్ను వదులుతారా?’ అని పేర్కొన్నారు. గాంధీని కాల్చిన గాడ్సే ఫొటోకు పూజలు చేస్తున్నారని విమర్శించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/