రజినీకాంత్‌ కు వైస్సార్సీపీ క్షమాణలు చెప్పాలి – చంద్రబాబు

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వేదిక ఫై మాట్లాడుతూ చంద్రబాబు ఫై ప్రశంసలు కురిపించారు. దీంతో రజనీ కామెంట్స్ ఫై వైస్సార్సీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ తరుణంలో చంద్రబాబు ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. జగన్ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ చేయకపోయినా ఆయనపై వైస్సార్సీపీ నీచపు వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్సార్‌సీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం అన్నారు.

వైస్సార్సీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదన్నారు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారన్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్‌పై వైస్సార్సీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే అన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి అన్నారు.