వైస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి

వైస్సార్సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ 101వ నంబరు ఫ్లాటులో మంజునాథరెడ్డి శవమై కనిపించారు. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం విగతజీవిగా కనిపించారు.

మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. కశ్మీర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో చేసిన పనులకు గాను రాంకీ సంస్థ నుంచి తమ కంపెనీకి బిల్లులు రావాల్సి ఉందని… బ్యాంకుల నుంచి సకాలంలో ఫైనాన్స్ అందలేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి గురయ్యారని పేర్కొన్నారు. మంజునాథ్ రెడ్డి మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మంజునాథ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మొదట అందరూ భావించినప్పటికీ… అక్కడి పరిస్థితులు అలా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. మంజునాథరెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్‌ ఆస్పత్రిలో ఉంది. ఆయన సతీమణి స్రవంతి వైద్యురాలుగా విధులు నిర్వర్తిస్తోంది.