మనకు నిజమైన స్వాతంత్ర్యం కాదు : కంగనా వ్యాఖ్య

కంగనాపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ముంబయి: ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. 1947లో మనకు లభించింది నిజమైన స్వాతంత్ర్యం కాదని.. అది మనకు వేసిన భిక్ష అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా లభించినదాన్ని నిజమైన స్వాతంత్ర్యంగా ఎలా భావిస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కూడా బ్రిటీష్ పాలనే కొనసాగిందని ఆమె చెప్పారు. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాతే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను పిచ్చితనంగా భావించాలా? లేక దేశద్రోహంగా భావించాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగింది. దేశ స్వాతంత్ర్యాన్ని అవమానించిన ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ డిమాండ్ చేశారు. కంగనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముంబయి పోలీసులను ఆప్ నాయకురాలు ప్రీతి శర్మ కోరారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/